GuruSwara - Online Carnatic Music Practice Software

GuruSwara - Online Carnatic Music Practice Software
Learn form Legends

Thursday, March 1, 2012

సంగీత గురుస్వరం - Andhra Jyothi Article about Guruswara

సంగీత గురుస్వరం

టీవీ ఛానెళ్లలో లెక్కకు మిక్కిలిగా ప్రసారమవుతున్న పాటల పోటీల పుణ్యమాని ఒక మంచి కూడా జరుగుతోంది. అదేంటంటే, చిన్నాపెద్దా అని లేకుండా ఖర్చు, శ్రమలను లెక్కచెయ్యకుండా ఎంతోమంది సంగీతాన్ని నేర్చుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే ఎక్కడంటే అక్కడ మంచి గురువులు దొరకడం కష్టం. ఒకవేళ దొరికినా ఉన్న విద్యార్థుల్లో ప్రతి ఒక్కరినీ ప్రతి నిమిషం కనిపెట్టి ఉంటూ సాధన చేయించడం గురువులకీ కష్టమే. ఇటు విద్యార్థులకూ, అటు గురువులకూ కూడా ఉపయోగకరంగా ఉండేలా 'గురుస్వర' అనే వెబ్‌సైట్ వచ్చింది. దీని ద్వారా ప్రపంచంలోని ఏ మూలనుంచైనా కోరుకున్న గురువుగారి దగ్గర సంప్రదాయ సంగీతాన్ని చక్కగా నేర్చుకోవచ్చు.

'గురుస్వర' ద్వారా సంగీతం నేర్చుకోవాలంటే చెయ్యాల్సింది చాలా సింపుల్. ముందు వెబ్‌సైట్లోకి లాగిన్ అవాలి. తర్వాత మనకు కావాల్సిన గురువును ఎంచుకొని వారు చెప్పే సంగీత పాఠాలను విని నేర్చుకోవడమే. ఇక ఫీజుల విషయానికి వస్తే, నెలకు 450 రూపాయల నుంచి మొదలు. గురువుల్లో పద్మభూషణులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నూకల చినసత్యనారాయణ, త్రిచూరు రామచంద్రన్ వంటివారితో పాటు హైదరాబాద్ బ్రదర్స్, నిత్యశ్రీ మహదేవన్, పంతుల రమ, డి. శేషాచారి, సరస్వతీవిద్యార్థి, మల్లాది సూరిబాబు, నైవేలి సంతానగోపాలన్, వైజర్సు బాలసుబ్రమణ్యం వంటి మహామహులైన వారు దాదాపు 40 మంది వరకూ ఉన్నారు.

వారు పాడిన కొన్ని వందల కృతులు, కీర్తనలు, జావళీలు 'గురుస్వర' లైబ్రరీలో ఉన్నాయి. ఈ లైబ్రరీని అభ్యాసగానం, సభాగానం, మనోధర్మ గానాలుగా విభజించారు. అందువల్ల విద్యార్థి తన స్థాయిని బట్టి ఎక్కడనుంచి కావాలంటే అక్కడ నుంచి పాఠాలు నేర్చుకోవడం మొదలుపెట్టొచ్చు. శృతిలయలు తప్పకుండా పాడటం వచ్చిన తర్వాత కూడా కచేరీలివ్వాలంటే గంటల తరబడి నిష్టగా సాధన చెయ్యాలి. అలా సాధన చేస్తున్నప్పుడు పొరపాటు దొర్లితే వాటిని వెంటనే సవరించగల సౌలభ్యాన్ని కల్పిస్తోంది గురుస్వర.

ఒక్కముక్కలో చెప్పాలంటే ఇవి ఆన్‌లైన్ కర్ణాటక సంగీత క్లాసులు. అలాగని వీడియో చాటింగ్ లేదా స్కైప్ వంటివి కాదు. వాటిద్వారా ఆన్‌లైన్‌లో సంగీతం నేర్చుకోవడం ఇప్పుడు ప్రచారంలో ఉన్నదే. అయితే గురుస్వర అంతకన్నా ఆధునికమైనదంటున్నారు ఈ వెబ్‌సైట్, సాఫ్ట్‌వేర్ రూపకర్తలు. 'వీడియో చాట్ లేదా స్కైప్ వంటి వాటిద్వారా సంగీతం నేర్చుకోవాలంటే అటు గురువు ఇటు విద్యార్థి ఒకటే సమయంలో ఇంటర్నెట్‌లో కంప్యూటర్ ముందు కూర్చోక తప్పదు.

కానీ గురుస్వర ద్వారా విద్యార్థి ఎప్పుడైనా ఎక్కడైనా సాధన చేసుకోవచ్చు. తమ సాధనను రికార్డ్ చేసుకోవచ్చు, గురువు పాడిన దానితో మీరు పాడుతున్నదాన్ని సరిపోల్చి పొరపాటు దొర్లితే వెంటనే సరిదిద్దే సాఫ్ట్‌వేర్‌ను ఇందులో నిక్షిప్తం చేశాం...' అంటున్నారు గురుస్వర రూపకర్తలయిన ఆనంద్ కూచిభొట్ల, శాన్ అప్పజోడు.

దీనిద్వారా సంగీతాన్ని నేర్చుకోవడం వీడియోగేమ్ ఆడుతున్నంత ఉత్సాహకరంగా ఉంటుంది. దాంతో నాణ్యమైన సాధన చాలాకాలం పాటు కొనసాగించవచ్చు'నని వాళ్లు భరోసానిస్తున్నారు. "భవిష్యత్తులో హిందుస్థానీ, పాశ్చాత్య సంప్రదాయ సంగీతాన్ని కూడా 'గురుస్వర' గొడుగు కిందకు తీసుకొచ్చే ఆలోచన ఉంది'' అని చెప్పారు ఆనంద్ కూచిభొట్ల.

No comments:

Post a Comment